ఆనందానికి తాళం చెవి ‘ఏడుపు’

ఏడవండి.. బాగా ఏడవండి.. అదేంటి? నవ్వుతూ ఉండమని చెప్పే బదులు ఏడవమని అంటున్నారనుకుంటున్నారా? నవ్వడం వల్లనే కాదు ఏడవడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయండి.

ఏడవడమంటే పిరికి చర్య అని, ఎవరేమనుకుంటారోనని, అందరిలో ఏడవడానికి వెనుకంజ వేస్తుంటారు. ఉబికివస్తోన్న భావోద్వేగాలను అణచివేసుకుంటారు. దీని వల్లన ఆ ఉద్వేగం, బాధ అలాగే ఉండి ఒత్తిడి అధికమవుతుంది. ఎవరి మీదైన మనకు కోపం ఉంటే తనివితీరా వారితో వాదులాడి, పిచ్చి తిట్లు తిట్టి కాసేపటి తర్వాత తేలికపడతాం. అంతెందుకు, భరించలేని సంతోషం కలిగినా, ఆనందభాష్పాలను రాలుస్తాం. అంటే కలిగిన అమితానందమనే భావం కన్నీళ్లతో బయటకు వస్తుంది. అందుకోసమే, ఏదైనా సందర్భంలో బాధ కలిగితే, తనివితీరా ఏడ్చేయండి, బాధ కలిగే దృశ్యాన్ని చూసినా, వార్తను విన్నా, సినిమాలోని సెంటిమెంట్ సన్నివేశం చూస్తున్నా, ఇంట్లో వాళ్లతో గొడవ కారణంగా మనస్సులో దిగులుగా ఉన్నా, మనస్పూర్తిగా ఏడ్చేయండి. బాధను దిగమింగుకుంటే, అది తీవ్రమై, ఒత్తిడిని పెంచుతుంది దాని వల్లన రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. మనసులోని బాధను దించేసుకొని ఒత్తిడిని దూరం చేసుకుని తేలికపడండి. దీని వల్లన ఆలోచించే విధానంలో స్పష్టత వస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బాధలో, కష్టాల్లో గుండె బరువైపోయినప్పుడు ఏం చేస్తున్నామో అర్థం కాదు, ఎలా స్పందిస్తున్నామో తెలియదు. ఆవేదనతో కూరుకుపోయిన మనస్సు, ఆలోచనలను కట్టిపడేస్తుంది. అందుకే భారమైన హృదయవేదనను కన్నీటి వరదల్లో కొట్టుకుపోనివ్వండి. సంతోష సాగరంలో సవారీ చేయండి.

2,009 thoughts on “ఆనందానికి తాళం చెవి ‘ఏడుపు’