ఈసీ ఆదేశంతో ఆగిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’

సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ రాజకీయ నాయకుల బయోపిక్‌లను విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌-లక్ష్మీపార్వతి బయోపిక్‌ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’, ప్రధాని మోదీ బయోపిక్‌ ‘పీఎం నరేంద్ర మోదీ’, కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. దీంతో మే 19 తర్వాతే ఈ సినిమాలు విడుదల కాబోతున్నాయి.
రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఇప్పటికే తెలంగాణలో విడుదలైంది. ఓ తెదేపా కార్యకర్త ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని ఈసీని కోరారు. దీంతో విడుదలను ఆపారు. ఈ వారంలో అక్కడ సినిమాను విడుదల చేయడానికి వర్మ సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఈసీ ఆదేశంతో మళ్లీ విడుదల తేదీ మారింది.
అదేవిధంగా ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రం విడుదల కూడా వాయిదా పడింది. ఈ చిత్రం వల్ల క్షేత్ర స్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఈసీ తెలిపింది. ఈ చిత్రం గురువారం ప్రేక్షకులు ముందుకు రావాల్సి ఉంది. సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఇందులో 11 సన్నివేశాలకు కత్తెర పడింది. విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న సంభాషణల వద్ద బీప్‌ శబ్దం వినిపించనుంది. ఈ చిత్రం విడుదలకు ఈసీ అడ్డు చెప్పడంతో మే 19 తర్వాతే విడుదల కానుంది.
ఇంతకుముందు ఈ చిత్రం విడుదలపై సుప్రీం కోర్టు సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విడుదలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే తాజాగా ఈసీ ఆదేశాలతో సినిమా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రంలో ప్రధాని మోదీ పాత్రలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటించారు. ఒమంగ్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

1,343 thoughts on “ఈసీ ఆదేశంతో ఆగిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’