ఈసీ తీరుపై మండిపడిన మాజీ ఉన్నతాధికారులు

 భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విశ్వసనీయత మునుపెన్నడూ లేనంతటి అథమ స్థాయికి దిగజారిందని మాజీ ఉన్నతాధికారులు ఆరోపించారు. భయంతో కూడిన ప్రవర్తనే ఇందుకు కారణమన్నారు. ఈసీ విశ్వసనీయత, పనితీరుపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ సవాళ్లు, సంక్లిష్టతలు ఎదుర్కొంటూనే.. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో ఎంతోకాలంగా గౌరవనీయమైన చరిత్ర కలిగిన ఈసీ ప్రస్తుతం విశ్వసనీయత సంక్షోభంతో బాధపడుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి.. అధికార పార్టీకి ప్రమేయం ఉన్న కేసులపై స్పందించే విషయంలో ఈసీ విఫలమవుతోందని ఆరోపిస్తూ 66 మంది మాజీ ఉన్నతాధికారులు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు. ఏశాట్‌ క్షిపణి ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం, మోదీ
బయోపిక్‌ చిత్రం, ‘మోదీ: ఓ సామాన్యుడి ప్రస్థానం’ వెబ్‌ సిరీస్‌ విడుదల, నమోటీవీ ఛానల్‌ ప్రసారం విషయంలో అలసత్వం వంటి అంశాలను వారు ప్రస్తావించారు.

ఏశాట్‌ క్షిపణిపై ప్రధాని బహిరంగ ప్రకటన చేసేందుకు ప్రస్తుతం దేశానికి వచ్చిన తక్షణ భద్రతా ముప్పేమీ లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రసారసంస్థ ద్వారా ప్రకటన చేయకూడదని, అయినా ఈసీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా పరిగణించలేదని ఆక్షేపించారు. ఎన్నికల ప్రకటన విడుదలైన తర్వాత ప్రభుత్వ విజయాలను ఏకరవు పెట్టడం ఉల్లంఘన కిందే వస్తుందని పేర్కొన్నారు.

ఈ నెల 11న విడుదలయ్యేందుకు సిద్ధమైన ప్రధాని మోదీ జీవితకథ చిత్రానికి ఈసీ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడాన్నీ వారు ఆక్షేపించారు. ఈ చిత్రం నిర్మాణం, పంపిణీ, ప్రచారం వంటి వాటికైన ఖర్చులన్నింటినీ మోదీ ఎన్నికల వ్యయంలో కలపాలని డిమాండ్‌ చేశారు. ఇది ఒక రాజకీయ నేత దొడ్డిదారిగుండా ఉచితంగా ప్రచారాన్ని పొందే యత్నమని విమర్శించారు.

యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ భారత సైన్యాన్ని మోదీసేనగా అభివర్ణించడంపై చర్య తీసుకోవాల్సిన ఈసీ మందలింపుతో సరిపెట్టిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసీ స్వతంత్రత, నిష్పాక్షికత, సమర్థత వంటివన్నీ ప్రస్తుతం రాజీ ధోరణిలో సాగుతున్నాయన్నారు. ఈసీ నిష్పాక్షిక పనితీరుపై ప్రజల్లో ఉన్న విశ్వాసం ఏమాత్రం సన్నగిల్లినా మన ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందన్నారు.

ఏపీలో ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు, సీఎస్‌ బదిలీ, పశ్చిమబెంగాల్‌లో నలుగురు పోలీసుఉన్నతాధికారుల బదిలీలను లేఖలో ప్రస్తావించారు. తమిళనాడు డీజీపీ గుట్కా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, డీజీపీని తొలగించాలని విపక్షాలు కోరుతున్నా ఈసీ స్పందించడం లేదని లేఖలో ఉదహరించారు.

ఏప్రిల్ 8న రాసిన ఈ లేఖపై సంతకం చేసిన వారిలో రాజస్థాన్‌ మాజీ సీఎస్‌ సలాహుద్దీన్‌ అహ్మద్‌, పంజాబ్‌ మాజీ డీజీపీ జూలియో రిబేరియో, ప్రసార భారతి మాజీ సీఈవో జవహర్‌ సర్కార్‌, దిల్లీ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌, పుణె మాజీ పోలీసు కమిషనర్‌ మీరన్‌ బోర్వాంకర్‌ తదితరులు ఉన్నారు. 

One thought on “ఈసీ తీరుపై మండిపడిన మాజీ ఉన్నతాధికారులు

  • May 8, 2019 at 7:21 am
    Permalink

    Excellent read, I just passed this onto a colleague who was doing some research on that. And he just bought me lunch as I found it for him smile So let me rephrase that: Thank you for lunch! “Never let inexperience get in the way of ambition.” by Terry Josephson.

    Reply

Leave a Reply

Your email address will not be published.