దిల్లీ చేరిన ఓట్ల తొలగింపు, డేటా చోరీ వ్యవహారం

ఏపీలో ఓట్ల తొలగింపు, డేటా చోరీపై పోరు దిల్లీకి చేరింది. వైకాపా చేసిన ఓట్ల తొలగింపు దరఖాస్తులు, తమ పార్టీ సభ్యత్వాల డేటా చోరీపై విచారించి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా నేతలు ఫిర్యాదు చేయగా.. రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై విచారణ జరిపించాలని వైకాపా నేతలూ విజ్ఞప్తి చేశారు. సోమవారం దిల్లీలో రెండు పార్టీల నేతలూ ఈసీని కలిసి ఈ ఫిర్యాదులు చేసుకున్నారు. రాష్ట్రంలో ఫారం-7తో అర్హుల ఓట్ల తొలగింపునకు వైకాపా నాయకులు తెలంగాణ, కర్ణాటక, బిహార్‌, ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేశారని సీఈసీకి తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు.

దిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్‌ అరోడా (సీఈసీ), కమిషనరు (ఈసీ) సుశీల్‌ చంద్రలను మంత్రులు కాలవ శ్రీనివాసులు, నక్కా ఆనంద్‌ బాబు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌, దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు సోమవారం సాయంత్రం కలిశారు. ఓట్ల తొలగింపునకు తామే దరఖాస్తు చేయించామని వైకాపా అధ్యక్షుడు జగన్‌, ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అంగీకరించినందున వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో ఐటీ కంపెనీ నుంచి తెరాస ప్రభుత్వం డేటా చోరీ చేసిందని, ఏపీ వ్యవహారాల్లో తెలంగాణ పోలీసులు అతిగా జోక్యం చేసుకుంటున్నారని, ప్రజలను భయపెట్టేలా వారి వైఖరి ఉందని తెలిపారు.

సైబారాబాద్‌ పోలీసు కమిషనరు వి.సి.సజ్జనార్‌ స్థాయికి మించిన ప్రకటనలు చేస్తున్నారని, ఆయన పరిధిలోని లేని అంశాలపై మాట్లాడుతున్నారని, తెలంగాణ పోలీసుల అత్యుత్సాహాన్ని నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. వైకాపాకు చెందిన సాక్షి పత్రిక, సాక్షి ఛానల్‌లో ప్రజలను మభ్యపెట్టేలా విచ్చలవిడిగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సాక్షి పత్రిక, ఛానల్‌లో కథనాలను పెయిడ్‌ న్యూస్‌గా పరిగణించాలని కోరారు. ఓట్ల తొలగింపు, డేటా చోరీ అంశంలో జగన్‌, విజయసాయిరెడ్డి కుట్రలను వెలికి తీయాలని విజ్ఞప్తి చేశారు.

ఓట్ల తొలగింపు దరఖాస్తులు, డేటా చోరీ, సాక్షి పత్రిక, ఛానల్‌ విష ప్రచారంపై తమ వాదనను సునీల్‌ అరోడా, సుశీల్‌ చంద్ర సావధానంగా విన్నారని తెదేపా నేతలు కాలవ శ్రీనివాసులు, నక్కా ఆనంద్‌ బాబు, కనక మేడల రవీంద్ర కుమార్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు తెలిపారు. ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. నేరస్థులైన జగన్‌, విజయసాయిరెడ్డి ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఫిర్యాదు చేసిన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఈసీ చెప్పారని తెలిపారు.

సీఈసీ సునీల్‌ అరోడా, ఈసీ సుశీల్‌ చంద్రలను వైకాపా నేతలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కలిశారు. ఓట్ల తొలగింపుపై తనిఖీలు చేయాలని కోరారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారం వైకాపా సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రక్రియ రెండు మూడేళ్ల నుంచే చేస్తోందని ఆరోపించారు. ఫారం -7పై తెదేపా తప్పుడు ప్రచారం చేస్తోందని చెప్పారు. రెండు చోట్ల ఓట్లున్న వారి వివరాలను పరిశీలించాలని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Leave a Reply

Your email address will not be published.