ప్రకాశం జిల్లాలో అడుగు పెట్టని వైవీ సుబ్బారెడ్డి

జగన్‌ బాబాయి, ఒంగోలు తాజా మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి బెట్టు వీడలేదు. తాను ముందు అనుకున్న ప్రకారం ఈ ఎన్నికల వేళ  ప్రకాశం జిల్లాలో అడుగు పెట్టలేదు. ఆయన అనుయాయులు అయోమయంలో ఉన్నా పట్టించుకోలేదు. ఇటు పార్టీ జిల్లా కీలక నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డితోనూ, అటు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డితోనూ పొసగక… పార్టీ తనకు చేసిన నష్టం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచి వై.వి. జిల్లాలో అడుగుపెట్టలేదు. ఆయనను నమ్ముకున్న ద్వితీయశ్రేణి నాయకుల్లో కొందరు తెదేపాలో చేరగా, ఇంకొందరు తటస్థంగా ఉండిపోయారు. మరికొందరు పనిగట్టుకుని మరీ ఇక్కడి ఒకరిద్దరు వైకాపా అభ్యర్థులను ఓడించే పనిలో ఉన్నారని సమాచారం.


ఎంపీగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో శ్రేణులకు అందుబాటులో ఉండేవారు. విపక్షంలో ఉన్నా, కీలక సమస్యలను తరచూ కేంద్రప్రభుత్వం దృష్టికి, ఇటు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తుండేవారు. వీటిపై ప్రజలకు స్పష్టమైన హామీలిచ్చారు. తనను మరోసారి గెలిపిస్తే వీటిని పరిష్కరిస్తానంటూ చెప్పేవారు. మళ్లీ తనే పోటీ చేస్తానన్న అంచనాతో శ్రేణులను, అనుయాయులను సిద్ధం చేసుకున్నారు. కానీ పార్టీ అధినేత ఆయనకు బదులుగా మాగుంటను రంగంలోకి దించారు. దాంతో తీవ్రంగా నొచ్చుకున్న వై.వి. చివరి వరకూ టిక్కెట్‌ కోసం ప్రయత్నించారు. తాను తెరవెనుక పార్టీకి అండగా ఉంటూనే, పోటీలో ఉంటానని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.  ఫలితం లేకపోవడంతో తన వర్గీయులకు ఏం చెప్పాలో తెలియక జిల్లాలో అడుగు పెట్టడం మానేశారు.


జిల్లాలో వై.వి.సుబ్బారెడ్డి వర్గాన్ని కలుపుకొని వెళ్లడంలో వైకాపా నాయకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పార్టీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాసరెడ్డికి, వైవీకి దీర్ఘకాలంగా మనస్పర్ధలు ఉన్నాయి. వైవీని తప్పించి, మాగుంటను రప్పించడంలో బాలినేని హస్తం ఉందని సుబ్బారెడ్డి వర్గీయులు గట్టిగా నమ్ముతున్నారు. మాగుంట కూడా తనకంటూ వర్గం ఉందన్న ధీమాతో వైవీ శ్రేణులను పట్టించుకోవట్లేదు. ‘వైవీ సుబ్బారెడ్డి నన్ను అవమానించేలా మాట్లాడారు. మా కుటుంబాన్ని చిన్నబుచ్చారు. ఆయనతో చొరవ అవసరం లేదు. కొత్తగా ఆయన వర్గం చేరితే మళ్లీ వివాదాలు రావచ్చు’ అని మాగుంట తన ఆంతరంగికుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ స్థితిలో వైవీ అనుయాయుల్లో కొందరు తెదేపాకు సహకరిస్తున్నారు. స్వయానా సుబ్బారెడ్డి సోదరుడు కూడా పార్టీ ప్రచారంలో పాల్గొనలేదు. ఎన్నికలవేళ నెలకొన్న ఈ గందరగోళం అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేస్తుందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

118 thoughts on “ప్రకాశం జిల్లాలో అడుగు పెట్టని వైవీ సుబ్బారెడ్డి

Leave a Reply

Your email address will not be published.