అన్న క్యాంటిన్లు అదుర్స్

  • రూ. 5కే అందుబాటులో ఆరోగ్యకరమైన ఆహారం
  • భోజనం కోసం బారులుతీరుతున్న ప్రజలు
  • పురపాలక సంఘాల్లో విశేష ఆదరణ
  • సానుకూల స్పందనతో అధికారుల్లో ఉత్సాహం

ఐదు రూపాయలకే ఆరోగ్యకరమైన, అందుబాటులో ఉండే ఆహారాన్ని అందించడం కోసం నగర పాలక, పురపాలక సంఘాల్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్లు పేద ప్రజల కడుపులు నింపుతూ ఆదరణ పొందుతున్నాయి.  రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 368 అన్న క్యాంటీన్లు ప్రారంభించగా అందులో 216 పట్టణ ప్రదేశాల్లో ప్రారంభించారు. రోజుకు 2.15 లక్షల మంది ప్రజలు ఈ అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రూ. 73 విలువ గల నాణ్యమైన ఆహారాన్ని మూడు పూటలా (బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్) రూ. 15 కే అందిస్తున్నారు. అక్షయ పాత్ర సంస్థకు కేటరింగ్ అప్పగించారు. ప్రతి క్యాంటీను ద్వారా రోజుకు 250 నుంచి 300 మందికి సరిపడా ఆహారం సిద్ధం చేసి ఉంచుతున్నారు. అవసరాన్ని బట్టి మరింత ఎక్కువ మందికి అందించేలా చర్యలు తీసుకున్నారు.

డిసెంబరు 2018 నాటికి 1.6 కోట్ల ప్లేట్ల భోజనం ప్రజలకు అందించగా, దీనిలో ప్రభుత్వ సబ్సిడీ రూ. 31.06 కోట్లుగా ఉంది. అన్న క్యాంటీన్లను ఐఒటి పరికరాల సాయంతో రియల్ టైం బేసిన్ ఆధారంగా డాష్ బోర్డు మీద పర్యవేక్షిస్తారు. అన్న క్యాంటీన్ ట్రస్టు పర్యవేక్షణ కూడా ఉంటుంది. టెక్నాలజీ వినియోగంతో నిర్వహణ, పర్యవేక్షణ ఉన్నందున అన్న క్యాంటీన్లు ఆదరణకు నోచుకుంటున్నాయి.

పట్టణాల్లో పనులు చేయడానికి వచ్చే కూలీలు, షాపుల్లో పనులు చేసే వారు తదితరులు అన్న క్యాంటీన్లను ఉపయోగించుకుంటున్నారు. అతి తక్కువ ధరకు భోజనం అందిస్తుండడం వల్ల పెద్ద త్తున తరలి వస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ క్యాంటీన్ల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు ఈ పథకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆకలి వేస్తే ఆనందంగా అన్నక్యాంటీనులో అన్నం తినగలుగుతున్నాం అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రూపాయల భోజనం చాలా రుచికరంగా ఉందనే అభిప్రాయం అన్ని చోట్ల వినిపిస్తోంది. అతి తక్కువ ధరలకు అల్పాహారం, భోజనం వీటిల్లో లభించడంతో తమ పేద బతుకులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అన్న క్యాంటీన్లను ఇలాగే కొనసాగించాలని, వీటిని ఏర్పాటు చేసి తమ కడుపులు నింపుతున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, సంబంధిత అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రజల నుంచి నుంచి వస్తున్న సానుకూల స్పందన అధికారుల్లో ఉత్సాహం నింపుతోంది.

 

Leave a Reply

Your email address will not be published.